విద్యార్థులపై ఫీజుల భారాన్ని తగ్గించాలి : టీజీవీపీ
By
Vaasthava Nestham
• ఫీజులు తగ్గించకపోతే ఆందోళన చేపడుతాం
• టీజీవీపీ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు కొట్టూరి ప్రవీణ్ కుమార్
వాస్తవ నేస్తం,ఆదిలాబాద్: విద్యార్థులపై ఫీజుల భారాన్ని తగ్గించాలని లేనియెడల జిల్లా వ్యాప్తంగా ఆందోళన చేపడతామని టీజీవీపీ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు కొట్టూరి ప్రవీణ్ కుమార్ హెచ్చరించారు. శనివారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేయూ పరిధిలో డిగ్రీ కోర్సుల మొదటి సెమిస్టర్,లో పెంచిన ఫీజులను తగ్గించాలన్నారు. కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఉమ్మడి ,ఆదిలాబాద్ వరంగల్ ఖమ్మం, జిల్లాలలో డిగ్రీ కోర్సులు 2025-26 ప్రవేశాలు పొందిన ఫస్ట్ ఇయర్ మొదటి సెమిస్టర్ విద్యార్థులకు వివిధ రకాల ఫీజులను ప్రభుత్వం భారీగా పెంచి పేద విద్యార్థులపై భారాన్ని మోపిందని అన్నారు.
రిజిస్ట్రేషన్ ఫీజు గతంలో రూ.80 ఉండగా ఇప్పుడు రూ.1200 ప్రభుత్వం పెంచిందన్నారు. రికగ్నేషన్ ఫీజు గతంలో రూ.400 ఉండగా ఇప్పుడు రూ.800 కు ఐయుడిఎఫ్ ఫీజు గతంలో రూ.60 ఉండగా ఇప్పుడు రూ.300, ఎస్డబ్ల్యూ ఎఫ్ ఫీజు గతంలో రూ.50 ఉండగా ఇప్పుడు రూ.200 కు పెంపుదల చేసి విద్యార్థులపై తీవ్ర ఆర్థిక భారాన్ని మోపారన్నారు. ఒక్క పరీక్ష ఫీజు మాత్రమే 750 గతంలో మాదిరిగానే యధావిదంగా కొనసాగిస్తున్నారు. గతంలో ఒక్కొక్క విద్యార్థి ఆయా అన్ని రకాల ఫీజుల కింద రూ.1340 చెల్లించేవారు. ఇప్పుడు ఏకంగా ఆ ఫీజులు అన్ని కలిపి రూ.3,250 కి పెంపుదల చేశారు. గతం కంటే ఒకేసారి ఒక్కో విద్యార్థిపై 1910 రూపాయలు ఫీజు భారం పడుతుందన్నారు. ఒకేసారి ఇంత భారీ మొత్తంలో పెంచిన ఫీజులతో విద్యార్థులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని, పేద విద్యార్థులు ఫీజులు కట్టలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. తక్షణమే ప్రభుత్వం పున:ర ఆలోచించి ఫీజుల భారం తగ్గించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతామని ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలో ఆదిలాబాద్ పట్టణ కన్వీనర్ వెంకట్, నియోజకవర్గ ఇంచార్జ్ సతీష్,బోథ్ నియోజకవర్గ కన్వీనర్ గొర్ల నరేందర్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.
Comments