-Advertisement-

Nominated Posts : ఊరిస్తున్న పదవులు...ఇంకెన్నాళ్లు..!!?

List of nominated posts in Telangana , Nominated posts in Telangana 2025 , Nominated posts in Telangana government , Congress nominated posts list
Vaasthava Nestham

• ప్రతిపక్షంలో పది సంవత్సరాల పోరాటం చేశాం.. ఇప్పుడు పదవులకోసం నాయకుల చుట్టూ తిరుగుతున్నాం
• నిరుత్సాహానికి లోనవుతున్న ఆశావహులు


వాస్తవ నేస్తం, హైదరాబాద్ బ్యూరో : ప్రభుత్వ నామినేటెడ్ పోస్టులు, కాంగ్రెస్ పార్టీ పదవులు ఆశావహులను ఊరిస్తూనే ఉన్నాయి. త్వరలోనే పదవుల పంపకం అంటూ.. ఆటు ప్రభుత్వం, ఇటు పార్టీ అధిష్ఠాన పెద్దలు ప్రకటనచేయడం. ఆ తర్వాత మరచిపోవడం పరిపాటిగా మారిందని ఆశావహులు తీవ్రంగా నిరుత్సాహపడుతున్నారు. పదేళ్లుగా పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోరాటం చేయడం.. అధికారంలోకి వచ్చాక నాయకుల చుట్టూ తిరగడం, కలిసిన వారికల్లా దండాలు పెట్టి అలసిపోయే స్థితికి వచ్చామని చెందుతున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 21 నెలలు పూర్తి కావస్తుంది. గతేడాది మార్చి నెలలో మొదటి విడతలో ఒకేసారి 37 మందిని కార్పొరేషన్ చైర్మన్లుగా రెండేళ్ల ఆవేదన పదవీ కాలానికి నియమించారు. తర్వాత రైతు, విద్యా, బీసీ, మహిళా కమిషన్ తదితర పోస్టులను కూడా భర్తీ చేశారు. ఇంకా రాష్ట్ర స్థాయిలో 30 నుంచి 40 వరకు వివిధ కార్పొరేషన్ చైర్మన్లతో పాటు జిల్లాల పరిధిలో కూడా చైర్మన్లు, డైరెక్టర్ల పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. 
ఇంకా భర్తీ చేయాల్సిన కార్పొరేషన్లలో ప్రధానంగా సివిల్ సప్లయ్, ఆర్టీసీ, మూసీ రివర్ ఫ్రంట్, మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎడ్యుకేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, బేవరేజేస్, గొర్లు, మేకల పెంపకం దారుల కార్పొరేషన్, టీజీఐడీసీ, హెచ్ఎండీఏ, హౌసింగ్ బోర్డు, గ్రామీణ నీటి సరఫరా, పట్టణాభివృద్ధితో పాటు కులవృత్తుల కార్పొరేషన్లు, గీత, రజక, వడ్డెర, పద్మశాలి, గొల్ల కురుమ, మాదిగ, మాల, రెడ్డి, బ్రాహ్మణ, మున్నూరు కాపు, లంబాడ, ఆదివాసీలతో పాటు ఇతర బీసీ కులాలు, ఎంబీసీ, వివిధ కులాల ఫెడరేషన్లకు చైర్మన్లు, సభ్యులను నియమించాల్సి ఉంది. వీటితో పాటు జిల్లాల స్థాయిలో గ్రాంథాలయం, బాలల హక్కుల కమిషన్ లాంటి పదవులు కూడా ఖాళీగానే ఉన్నాయి. అయితే, మొదటి విడతలో భర్తీ చేసిన చైర్మన్ల పదవీ కాలం ఏడాదిన్నర కావస్తుంది. మరో ఆరు నెలల్లో కొందరి పదవీ కాలం ముగుస్తుంది. ప్రభుత్వం ఏర్పడిన మొదట్లోనే అన్ని పోస్టులను భర్తీ చేసుంటే రెండో విడతలో అదనంగా వందలాది మందికి అవకాశం కల్పించడానికి వీలుండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. త్వరలోనే ఎస్సీ కమిషన్ పదవీ కాలం కూడా పూర్తి కావస్తోంది. ఇక పార్టీ పదవుల భర్తీలోనూ తీవ్ర జాప్యం జరుగుతోంది. పీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ నియామకం జరిగి ఏడాది పూర్తయింది. అయినా, పీసీసీ కార్యవర్గం మాత్రం పూర్తిగా నియమించుకోలేని పరిస్థితి. అంతే కాకుండా జిల్లా కాంగ్రెస్, మండల, బ్లాక్ కమిటీలను కూడా కొత్తవారిని నియమించాల్సి ఉంది. పార్టీ పదవులు ఆశించే వారి సంఖ్య భారీగానే ఉంది. కాగా, మూడు నెలల క్రితం 27మందిని టీపీసీసీ ఉపాధ్యక్షులుగా, 69 మందిని టీపీసీసీ ప్రధాన కార్యదర్శులుగా పార్టీ అధిష్టానం ప్రకటించిన విషయం తెలిసిందే. ఇంకా పీసీసీ అధికార ప్రతినిధులు, పీసీసీ కార్యదర్శులు, ఆర్గనైజర్, ప్రచార కార్యదర్శులు, పార్టీ కార్యవర్గ సభ్యులతో పార్టీ అనుబంధ సంఘాలకు రాష్ట్ర కమిటీలు, జిల్లా స్థాయి లో నియమించాల్సి ఉంది. వీటితో పాటు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్స్, ప్రచార కమిటీ చైర్మన్ పోస్టుల్లో కొత్త వారికి అవకాశం ఉంటుందని చర్చ జరుగుతోంది. వర్కింగ్ పోస్టుల కోసం ఎంపీలు, ఎమ్మెల్యేలతో పాటు పలువురు సీనియర్లు పోటీ పడుతున్నారు. దీంతో వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టుల భర్తీ మరింత ఆలస్యమవుతోందని గాంధీభవన్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇక పార్టీ, ప్రభుత్వ నామినేటెడ్ పోస్టులతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వ హిస్తే వేలాది మందికి పోటీ చేసే అవకాశం వస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ పాలక వర్గాలు ఖాళీగానే ఉన్నాయి. గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తే 12 వేల మందికి పైగా సర్పంచ్లు, ఇక వార్డుల సభ్యులుగా దాదాపు లక్షకు మందికి పైగా పోటీ చేసే అవకాశం కల్పించవచ్చనే చర్చ జరుగుతోంది. ఇక వేల సంఖ్యలో ఎంపీటీసీలు, మున్సిపల్ కౌన్సిలర్స్, వందల సంఖ్యలో జెడ్పీటీసీలుగా పోటీ చేసే అవకాశం వస్తుంది. పార్టీ పదవులు, ప్రభుత్వ నామినేటెడ్ పోస్టుల భర్తీ చేయడం వల్ల వచ్చే అన్ని ఎన్నికలకు పార్టీ కేడర్ ఉత్సాహంగా పని చేయడానికి ఆస్కారం ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే, పదవుల పంపకం విషయంలో అటు ప్రభుత్వం, ఇటు పార్టీ పరంగా ఎప్పుడు నిర్ణయం తీసుకుంటారనేది వేచి చూడాల్సిందే.
Comments
 -Advertisement-

Join Our Channels

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, రోజువారి తాజా సమాచారం పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి.